పలు మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

పలు మండలాల్లో వర్షం

Nov 25 2025 9:18 AM | Updated on Nov 25 2025 9:18 AM

పలు మండలాల్లో వర్షం

పలు మండలాల్లో వర్షం

కడప అగ్రికల్చర్‌: అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. ఇందులో భాగంగా సీకేదిన్నెలో అత్యధికంగా 20 మి.మీ వర్షం కురిసింది. అలాగే అట్లూరులో 19.6, పులివెందుల్లో 19, ఒంటిమిట్టలో 16.8, కమలాపురంలో 14.2, చెన్నూరులో 13.6, సిద్దవటంలో 12.8, పెండ్లిమర్రిలో 11.8, లింగాలలో 11, వల్లూరులో 10.4, కలసపాడులో 10.2, ఖాజీపేటలో 9 , చక్రాయపేట, తొండూరులలో 7.2, వీఎన్‌పల్లిలో 5.8, మైదుకూరులో 5.2, చాపాడులో 4.6, బి.కోడూరులో 3.4, జమ్మలమడుగు, వేములలో 3, పోరుమామిళ్లలో 2, వేంపల్లి, కాశినాయనలలో 1.8 మి.మీ వర్షం కురిసింది.

27న క్రీడా పోటీలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవం(డిసెంబర్‌3) సందర్భంగా ఈ నెల 27న వివిధ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ (100 మీటర్ల పరుగు, షాట్‌పుట్‌, డిస్క్‌త్రో), వాలీబాల్‌, చెస్‌ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. డీఎస్‌ఏ మైదానంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.

26 నుంచి శిక్షణ

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ (ఏటీఎల్‌) ఉన్న ప్రిన్సిపల్స్‌కు, హెడ్‌మాస్టర్స్‌తోపాటు ఏటీఎఫ్‌ ఇన్‌చార్జు టీచర్స్‌కు ఈ నెల 26 నుంచి 28 వరకు జిల్లాస్థాయి శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినేజర్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కడప చిన్నచౌక్‌లోని అంబేడ్కర్‌ గురుకులంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణలో అటల్‌ ల్యాబ్‌ నిర్వహణ, రిజిస్టర్‌ల నిర్వహణ, లీప్‌ యాప్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేయడం, ఏఐ ఎం పోర్టల్‌లో డాష్‌ బోర్డు నింపడం, ట్రెంచ్‌ అమౌంట్‌ కోసం అప్‌లై చేయడం, ఎలక్ట్రానిక్స్‌ మీద, కోడింగ్‌, మీద ప్రాథమిక విజ్ఞానాన్ని కలిగిస్తారని డీఈఓ, డీఎస్‌ఓలు తెలిపారు.

‘ఉపాధి’ ప్రణాళిక సిద్ధం

కడప సిటీ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు. రూ. 245.60 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. 80 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. కాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల పనిదినాలు చేయాల్సి ఉండ గా...ఇప్పటివరకు రూ.61.39 లక్షలు పనిదినా లు నమోదయ్యాయి. ఇంకా 8.60 లక్షల పనిదినా లు మార్చి చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్ద పోలిరెడ్డి

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ని బద్వేలు నియోజకవర్గానికి చెందిన వంకెల పెద్ద పోలిరెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

3న అరుణాచలానికి

ప్రత్యేక సర్వీసులు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబరు 3వ తేది జిల్లాలోని వివిధ డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప డిపో నుంచి ఉదయం 5 గంటలకు సూపర్‌ లగ్జరీ సర్వీసు రాయచోటి, పీలేరు మీదుగా అరుణాచలం బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ.1044 ఛార్జీగా నిర్ణయించారన్నారు. బద్వే లు డిపో నుంచి ఉదయం 9 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా అల్ట్రాడీలక్స్‌ సర్వీసు, మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌మీదుగా సూపర్‌ లగ్జరీ సర్వీసు, ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు మైదుకూరు, కడపమీదుగా సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని వివరించారు. అలాగే జమ్మలమడుగు డిపో నుంచి ఉదయం 5.30 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా సూపర్‌ లగ్జరీ బస్సు, పులివెందల డిపో నుంచి ఉదయం 7 గంటలకు రాయచోటి, పీలేరు మీదుగా అల్ట్రా డీలక్స్‌ సర్వీసు నడుస్తుందని తెలిపారు. అలాగే శబరిమలకూ అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్నామన్నారు.

నేటి నుంచి జోనల్‌ మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నేటి నుంచి అండర్‌–14 మల్టీ డే జోనల్‌ రెండు రోజుల మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లు సౌత్‌జోన్‌ విన్నర్‌, నార్త్‌జోన్‌ విన్నర్స్‌,సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌, రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌, రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌,రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్ల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు. మ్యాచ్‌లు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియం, కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం మైదానాల్లో జరుగుతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement