విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది భాషోపాధ్యాయు
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది భాషోపాధ్యాయులేనని పంచసహసస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, సంస్కృతి సేవాసమితి ఆధ్వ ర్యంలో ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కడప మమతల గడప, నా ఉనికికి చిరునామా, నేను కడప వాసిని అని, ఇక్కడ రామకృష్ణ జూనియర్ కళాశాలలో అధ్యా పకుడిగా పని చేశానన్నారు. భాష ఉంటేనే మానవుని మనుగడ, సంస్కృతి ఉంటుందన్నారు. అటువంటి భాషలపై విద్యార్థులు పట్టు సాధించడం కోసం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ భాషాంశాలతో పాటుగా రామాయణంపై పోటీ పెట్టడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. అనంతరం ప్రతిభా పరీక్ష విజేతలలో మొదటి బహుమతి విజేత కలిసెట్టి పూర్ణచంద్ర జెడ్పీ హైస్కూల్ దొమ్మర నంద్యాల (మైలవరం మండలం) రూ.5000, ద్వితీయ బహుమతి కె.అభినయశ్రీ జెడ్పీ హైస్కూల్ (సింహాద్రిపురం) రూ.3500, తృతీయ బహుమతి టి.వెంకట హారిక జెడ్పీ హైస్కూల్ (పెద్దముడియం), సుధశ్రీ జెడ్పీ హైస్కూల్ (వీరబల్లి)రూ.1000తోపాటు పదిమంది విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డి.కె.చదువులబాబు, డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, అంకాల్ కొండయ్య, గంగాధర్, గుండ్లమడుగు నరసింహ సాయికుమార్, వెంకట ప్రసాద్, సాయి ప్రసాద్, ఇటీవల పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, డీఈఓ పూల్ నుంచి పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులు, జిల్లాలోని తెలుగు, హిందీ భాషోపాధ్యాయులు, మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ


