కమలాపురం: పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా, జహీరియా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతి సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో అశేష భక్తజన సందో హం నడుమ బుధవారం సాయంత్రం ఉరుసు ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ జెండాను ఊరేగింపుగా తీసుకువచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా పెద్ద దర్గాకు చేరుకుంది. ఊరేగింపులో ప్రత్యేక డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ యువత వివిధ రకాల నృత్యాలు చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా నషాన్‌ను దర్గా ఆవరణలో ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్‌లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహా చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, సర్ఫరాజ్, ఇస్మాయిల్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు.
నేడు గంధ మహోత్సవం: కమలాపురం పెద్ద దర్గాగా విరాజిల్లుతున్న దర్గా–ఏ–గఫారియా ఖాదరియాలో గురువారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్‌ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు.
నషాన్ ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి, సోదరులు ఉరుసు ప్రారంభానికి సూచికగా నషాన్ ఊరేగిస్తున్న భక్తులు


