స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి

Nov 22 2025 7:00 AM | Updated on Nov 22 2025 7:00 AM

స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి

స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి

బద్వేలు అర్బన్‌ : పట్టణానికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్‌–67 బైపాస్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి అదుపు తప్పి స్కార్పియో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి పెద్దలక్షుమ్మ (85) తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గ్రామంలో శనివారం రాత్రి తమ సమీప బంధువుల శుభకార్యం ఉండటంతో.. కుటుంబ సభ్యులంతా కారులో స్వగ్రామానికి బయలుదేరారు. గూడెం, గుంతపల్లె మార్గంమధ్యలోని ఎన్‌హెచ్‌–67 బైపాస్‌ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా.. కుక్క అడ్డురావడంతో సడన్‌గా బ్రేక్‌ వేశారు. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో పెద్దలక్షుమ్మ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాహనంలోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అర్బన్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

జమ్మలమడుగు రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలైన సంఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన చవ్వా ప్రసాద్‌రెడ్డి, నాగేష్‌ రోడ్డు పనులు ముగించుకుని ప్రొద్దుటూరు నుంచి బైక్‌లో జమ్మలమడుగుకు వస్తుండగా.. మార్గంమధ్యలోని ధర్మాపురం వద్దకు రాగానే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో చవ్వా ప్రసాద్‌రెడ్డి కుడిచేయి విరిగి తీవ్ర గాయాలు కాగా నాగేష్‌కు రెండు కాళ్లు విరిగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వెనుక వైపు నుంచి వస్తున్న టిప్పరు.. ఒక్క సారిగా బ్రేక్‌ వేయడంతో వెనుక వైపు నుంచి వస్తున్న నాన్‌స్టాప్‌ బస్సును టిప్పరు ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న జయరాముడు, సింగరయ్య, వీరయ్య, మణి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్ర గాయాల పాలైన చవ్వా ప్రసాద్‌రెడ్డి, నాగేష్‌, జయరాముడును ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్‌ లిఖిత సూచించారు.

జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌ విచారణ

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో గతంలో పని చేసిన సీనియర్‌ అసిస్టెంట్‌పై చిత్తూరు డీసీహెచ్‌ఎస్‌ పద్మాంజలిదేవి విచారణ చేశారు. గతంలో ఇక్కడ నాగార్జున అనే సీనియర్‌ అసిస్టెంట్‌ పని చేస్తూ ధర్మవరం ఆస్పత్రికి బదిలీ అయ్యారు. కొన్నేళ్ల కిత్రం జరిగిన ఓ కేసు విషయమై ఆయన అనధికార సెలవులో వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు డీసీహెచ్‌ఎస్‌తోపాటు మరో ఇద్దరు అధికారులు శుక్రవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ సుజాత, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శివరాంతో మాట్లాడారు. నాగార్జున సర్వీసు రికార్డును పరిశీలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎన్ని రోజులు పని చేశారు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేదనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement