కిడ్నీ రాకెట్‌లో పెద్ద తలకాయలు? | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌లో పెద్ద తలకాయలు?

Nov 14 2025 6:23 AM | Updated on Nov 14 2025 6:23 AM

కిడ్నీ రాకెట్‌లో పెద్ద తలకాయలు?

కిడ్నీ రాకెట్‌లో పెద్ద తలకాయలు?

మదనపల్లె రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్‌ మాఫియా గుట్టు వీడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర విశాఖకు చెందిన మహిళ, సుమారు 1000 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లెకు వచ్చి కిడ్నీ ఇవ్వడం వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది, ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతోంది.. తెర వెనుక సూత్రధారులు ఎవరు..? బడాబాబులు ఎవరికై నా ఇందులో ప్రమేయం ఉందా..? అన్న విషయాలపై పట్టణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కిడ్నీ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితుడు జిల్లా ఉన్నత ప్రభుత్వ వైద్యాధికారి కావడం, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేని ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు ప్రత్యేక బృందం గురువారం బెంగళూరుకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నీ ఆపరేషన్‌లో బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు కీలకంగా వ్యవహరించాడనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు కర్నాటకకు వెళ్లినట్లు తెలిసింది. మదనపల్లెలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో పెద్ద మాఫియా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నాలుగు రోజులుగా ఎదురు చూపులు...

కిడ్నీ రాకెట్‌లో ప్రాణాలు కోల్పోయిన యమున మృతదేహం కోసం నాలుగు రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మదనపల్లెలో మరణించిన యమున మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తిరుపతికి తరలించడం, అక్కడి నుంచి మళ్లీ మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకురావడం, ఒకరోజు తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్‌, యూరాలజీ వైద్యనిపుణులు లేరంటూ తిరిగి తిరుపతి రుయాకు తరలించడం చేశారు. నాలుగోరోజు గురువారం మధ్యాహ్నం ఎట్టకేలకు యమున మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టంలో యమున శరీరంలో ఎడమ పక్కన కిడ్నీ తొలగించినట్లు వైద్యులు నిర్ధారించారు.

డీసీహెచ్‌ఎస్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు...

కిడ్నీ రాకెట్‌ కేసులో ప్రభుత్వ డీసీహెచ్‌ఎస్‌ ఆంజనేయులును ఏ–1 నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు...మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్‌ విభాగం ఇన్‌చార్జ్‌గా పనిచేస్తూ, గ్లోబల్‌ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డాక్టర్‌ శాశ్వతి, ఆమె భర్త డాక్టర్‌ అవినాష్‌లను అదుపులోకి తీసుకోకపోవడమే కాకుండా, కేసులో వారి పేర్లను ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఏ–1 నిందితుడైన ఆంజనేయులతో సన్నిహిత సంబంధాలు కలిగి, ఎన్నో ఏళ్లుగా అతడితో కలిసి పనిచేసిన వైద్యులు చిత్తూరు డీసీహెచ్‌ఎస్‌ పద్మాంజలిదేవి, అన్నమయ్య డీఈఎంఓ దేవశిరోమణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమేష్‌బాబు తదితరులను విచారణ అధికారులుగా నియమించడం అనేక సందేహాలకు తావిస్తోంది. వీరిచ్చే నివేదికకు ఏమాత్రం విశ్వసనీయత ఉంటుందోనని చర్చ మొదలైంది.

కేసు నీరుగార్చేందుకు తెరవెనుక కుట్ర...

కిడ్నీ రాకెట్‌ కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్ద కుట్ర నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు డీసీహెచ్‌ఎస్‌ ఆంజనేయులు పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం, కుమారుడు, కోడలు వైద్యులుగా ఉండటం, పలువురు ప్రముఖులతో విస్తృత పరిచయాలు కలిగి ఉండటంతో కేసును నీరుగార్చేందుకు తెరవెనుక కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

డాక్టర్‌ శాశ్వతి సస్పెన్షన్‌, బాలరంగడు డిస్మిస్‌...

కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి డయాలసిస్‌ టెక్నీషియన్‌, ఏ–3 బాలరంగడును విధుల నుంచి తొలగించారు. డయాలసిస్‌ కేంద్రం ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతిని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ అపోలో రీజినల్‌ మేనేజర్‌ ముఖేష్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఎక్కడ విశాఖ.. ఎక్కడి మదనపల్లె

నాలుగురోజులుగా మృతదేహం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ

నిందితుడు ప్రభుత్వ వైద్యుడు కావడంతో కాపాడేందుకు ప్రయత్నాలు

కేసు నీరుగార్చేందుకు తెరవెనుక కుట్ర

బెంగళూరుకు ప్రత్యేక విచారణ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement