సర్వే నంబర్లన్నీ గోల్డెన్ రికార్డులుగా మార్చాలి
గనుల నిర్వహణపై దృష్టి సారించాలి
కడప సెవెన్‌రోడ్స్: భూ రికార్డుల స్వచ్చీకరణ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లోని రెవెన్యూ రికార్డులను గోల్డెన్ రికార్డులుగా తీర్చిదిద్దే చర్యలను ముమ్మరం చేస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో.. బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న భూ సమస్యలపై సంబంధిత రెవెన్యూ అధికారులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు జేసీ అదితి సింగ్, బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, కుడా సెక్రెటరీ శిరీష హాజరయ్యారు. ఇందులో భాగంగా బి.మఠం మండలానికి ఏర్పాటు చేసిన 20 మంది వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టీమ్ సభ్యులకు కలెక్టర్ పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గతంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల భూ ఆక్రమణలు, భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగాయన్నారు. ప్రత్యేకించి బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలతో పాటు, బి.మఠం మండలంలో అధిక సంఖ్యలో భూ సమస్యలు ఉన్నట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీముల ద్వారా అన్ని గ్రామాల్లో రెవెన్యూ భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేట్టామన్నారు. అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎటువంటి తప్పిదాలు, ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలని ప్రత్యేక టీమ్ సభ్యులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, తహశీల్దార్లు వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేయడంలో మరింత కృషి చేయాలని.. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సభ్యులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘాలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలన్నారు. సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలిచ్చారు. అనంతరం అఖిలభారత సహకార వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీసీఓ వెంకట సుబ్బయ్య, డీసీబీ సీఈవో రాజామణి, నాబార్డు ఏజీఎం విజయవిహారీ, డీసీఓ సుభాషిణి, డీపీవో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనుల నిర్వహణపై ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మైనింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జేసీ అదితిసింగ్‌తో కలిసి జిల్లాలో మైనింగ్ క్వారీల నిర్వహణపై సంబంధిత మైన్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్ని గనులు నిర్వహణలో ఉన్నాయి..? నిర్వహణలో ఉన్న అన్ని క్వారీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు లోబడి నిర్వహణలో ఉన్నాయా..? అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా..? సామాజిక బాధ్యత, వార్షిక రాబడి, ఆదాయం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పులివెందుల ఆర్డీవో చిన్నయ్య మైన్స్ డీడీ సుబ్రమణ్యం, మైన్స్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సుధ, రాయల్టీ ఇన్స్పెక్టర్‌లు తహశీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


