జనవరిలో గండికోట ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్:గండికోట ఉత్సవాలు–2025 జనవరి నెలలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో నిర్వహించిన జిల్లా టూరిజం కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ఉత్సవాలను జనవరి నెలలో వారం రోజులపాటు నిర్వహించేందుకు ప్రణాళికల రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సంఘాలతో కడప జిల్లా స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయాలన్నారు. అలాగే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట టూరిజానికి ప్రత్యేకంగా ఆహ్వాన బోర్డులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. మైలవరం బోటింగ్, అడ్వెంచర్ ఆక్టివిటీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గండికోట ఉత్సవాలను ప్రమోట్ చేసే విధంగా బైక్,సైక్లింగ్ వంటి ఈవెంట్లతో పాటు బెంగళూరులో ప్రమోషనల్ ఈవెంట్‌కు ప్రణాళికలు చేయాలన్నారు. జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.టెంపుల్ టూరిజం, ఎకో టూరిజానికి మంచి అవకాశాలున్నాయన్నారు. డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్టీవో సాయి శ్రీ, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.


