వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సభా భవన్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హిమదేవిలతో కలిసి వైద్యాధికారులతో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు.ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రతినెలా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో సెప్టెంబర్ మాసానికి అన్ని పారామీటర్లలో వైఎస్‌ఆర్ కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని, అందుకు జిల్లా వైద్యాధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. డీసీహెచ్‌ఎస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
పంటల సస్యరక్షణ, వాతావరణ
మార్పులపై సాంకేతిక పర్యవేక్షణ
ఉద్యాన పంటల సస్యరక్షణ, వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు ఎంతో అవసరమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్ ఉద్యాన పంటలకు ఐఓటీ సాంకేతికతను పరిచయం చేసే దిశగా క్రాపిన్ సంస్థ ప్రతినిధులతో వర్చువల్‌గా, ఫసల్ సంస్థ ప్రతినిధులతో నేరుగా జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముందుగా క్రాపిన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే మరో సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా పండించే పంటలకు అవసరమైన సస్యరక్షణ పర్యవేక్షణ చర్యలను చేపట్టే నూతన డివైజ్‌కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డి, నీరజ్ సాహు, వరుణ్ బానోత్‌లు కలెక్టర్‌కు వివరించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ కుమార్, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర రెడ్డి, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, నీతి ఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్స్, ఫసల్ టీమ్ తరపున అనిల్ నాయక్ (స్టేట్ హెడ్), విగ్నేష్ (టెర్రిటరీ మేనేజర్), ప్రదీప్ (ఏరియా సేల్స్ ఆఫీసర్–కడప) పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ పాజిటివ్ వివరాలు సేకరించాలి
జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తుల వివరాలు, వారు ఏయే మండలాలలో ఉన్నారో పక్కాగా తెలుసుకుని వారికి అవసరమైన చికిత్సను అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ యూనిట్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్, ఎన్జీవోలు ప్రోగ్రాం మేనేజర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


