● మత్తులో జోగుతున్న యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు సర్కార్‌లో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. నదులు తెలుగు తమ్ముళ్ల అక్రమ ఆదాయ కోరల్లో చిక్కి శల్యమవుతున్నాయి. ప్రధానంగా పెన్నా, పాపాఘ్ని నదులను చెరబట్టారు. ఉచిత ఇసుక మాటున లూటీ చేస్తున్నారు. పేరుకే ప్రభుత్వ రీచ్‌లు.. పక్కనున్న గ్రామాల నుంచి యథేచ్ఛగా మిషన్లు పెట్టి లోడింగ్ చేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. అధికారిక ఇసుక రీచ్‌లతో నిమిత్తం లేకుండా కొండాపురం మండలం వెంకయ్యకాలువ వద్ద అక్రమంగా తరలిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు.
● ప్రకృతి సంపద అధికార పార్టీ నేతల పాలిట కల్ప తరువుగా మారింది. ఉచిత ఇసుక తెలుగు తమ్ముళ్లకు దోపిడీ పథకంగా తయారైంది. యథేచ్ఛగా ఇసుక లూటీ కొనసాగిస్తున్నారు. అక్రమ సంపాదన కోసం పోటీ పడుతున్నారు. చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని నదులను చెరబట్టారు. పొక్లెయిన్ల ద్వారా లోడింగ్ చేస్తూ భారీ టిప్పర్లతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అదే స్థానికంగా వినియోగదారుడికి ఇసుక కావాలంటే చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ రీచ్‌లు దక్కించుకుని పొరుగునే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా సరిహద్దు దాటిస్తున్నారు. కొండాపురం మండలంలో ఏటూరు, రామిరెడ్డిపల్లె (పి.అనంతపురం), బెడుదూరు ప్రాంతాల్లో అధికారిక ఇసుక రీచ్‌లకు రెండు, మూడు కిలోమీటర్ల దూరం నుంచి అనధికారికంగా తరలిస్తున్నారు. వెంకయ్యకాలువ వద్ద ఎలాంటి రీచ్ లేకపోయినా అక్కడి నుంచి నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు పోటీపడి మరీ ఇసుక తరలించడం విశేషం.
ప్రధాన నగరాలకు తరలింపు...
జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి ప్రధాన నగరాలకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. యంత్రాలతో లోడింగ్ చేసి, భారీ టిప్పర్లతో ఇసుక కనిపించకుండా పట్ట కట్టుకొని బెంగళూరు నగరానికి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నదుల్లో అధికారిక రీచ్‌లలో ఇసుక అలాగే కొనసాగిస్తూ ఆ మాటున పొరుగు గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ విషయం మైనింగ్ శాఖలో పనిచేస్తున్న చిరుద్యోగి నుంచి జిల్లా సర్వోన్నతాధికారి వరకూ అందరికి తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండడమేనని పలువురు వివరిస్తున్నారు.
ఉచితం.. అధికార పార్టీ నేతలకు ఫలహారం
పేరుకే అధికారిక రీచ్‌లు.. నదుల్లో మిషన్లు పెట్టి బాహాటంగా తరలింపు
పాపాఘ్ని, పెన్నా నదుల్లోకి రహదారి ఏర్పాటు చేసి తరలిస్తున్న వైనం
కొండాపురం మండలంలో పోటీ పడి తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లు
ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
అధికారిక ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. ఇసుక రీచ్ కేటాయింపు నిల్వల కంటే పది రెట్లు అధికంగా పక్కనున్న ప్రాంతాల నుంచి తరలించుకెళ్తున్నారు. ఈ తతంగం కొండాపురం మండలంలో నిత్యం కొనసాగుతోంది. వెంకయ్యకాలువ వద్ద ఎలాంటి అనుమతులు లేకపోయినా నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఇసుక తరలించుకెళ్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో తెలుగు తమ్ముళ్లు అడ్డు అదుపు లేకుండా తరలించుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఇసుక రీచ్‌ల హద్దులు దాటి రెండు కిలోమీటర్ల దూరంలో ఇసుక తరలించుకు పోతున్నా కనీసం కట్టడి చేయాలన్న స్పృహ ఉన్నతాధికారులకు కొరవడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
● మత్తులో జోగుతున్న యంత్రాంగం
● మత్తులో జోగుతున్న యంత్రాంగం


