చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా రాజకీయ ప్రత్యర్థులకు కక్ష సాధింపులు మినహా చేసిన అభివృద్ధి శూన్యమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లాలో యానిమేటర్లు, చౌక దుకాణ డీలర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆయాలను అక్రమంగా తొలగిస్తున్న అధికార పార్టీ నేతలు ఆ స్థానాల్లో తమ కార్యకర్తలను నియమించుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అవేవి వారికి పట్టడం లేదన్నారు. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామంలో ఒక సచివాలయ ఉద్యోగి శనగలు, ఎరువుల కోసమంటూ రైతుల నుంచి రూ. 20 లక్షలు వసూలు చేసి ఉడాయించాడని తెలిపారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్డీఓ, పోలీసులు స్పందించడం లేదన్నారు. అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేయడం తగదన్నారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమించారని ఆరోపిస్తున్న కూటమి నేతలు ఆధారాలుంటే రుజువు చేయాలన్నారు. ఆ భూములపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని, డాక్యుమెంట్లు సైతం ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని పెద్దిరెడ్డి కుటుంబం స్పష్టమైన ఆధారాలు చూపెడుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెలికాఫ్టర్ నుంచి వీడియోలు తీసి షో పుటప్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు షఫీ, ఎస్సీ విభాగం నాయకుడు సీహెచ్ వినోద్‌కుమార్, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


