● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

Nov 8 2025 7:40 AM | Updated on Nov 8 2025 7:42 AM

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

భూగర్భగనుల శాఖ అధికారుల దాడులు

సాక్షి ప్రతినిధి, కడప: ఏడాదిగా వేముల కేంద్రంగా బైరెటీస్‌ నిక్షేపాల దోపిడీ బహిరంగంగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. లీజు అనుమతులు ఉన్న వారైనా సరే, అక్రమార్కుల కనుసన్నల్లోనే మైనింగ్‌ నిర్వహించాలనే నిబంధన పెట్టారు. అక్రమ మైనింగ్‌ ద్వారా ఆదాయం గడించడం ఒక మార్గమైతే.. దౌర్జన్యం, దోపిడీలతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేనిచోట కూడా యథేచ్ఛగా క్రేన్లు బిగించి మైనింగ్‌కు పాల్పడుతున్నారు. సీఎంఓకు ఫిర్యాదులు వెళితే తప్ప, స్పందించే పరిస్థితిలో మైనింగ్‌ యంత్రాంగం లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

● వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిగా అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా నడుస్తోంది. అక్రమ మైనింగ్‌ బ్లాస్టింగ్‌లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందారు. అయినప్పటికీ స్థానిక అధికారులు స్వయంగా పంచాయితీలు చేసి ఎలాంటి కేసులు లేకుండా చూశారు తప్ప, అక్రమ మైనింగ్‌ కట్టడికి చర్యలు చేపట్టలేదు. తాజాగా రీజనల్‌ విజిలెన్సు స్క్వాడ్‌ (ఆర్వీఎస్‌) ఏడీ సుబ్రమణ్యం, ఏజీ కృష్ణమూర్తి నేతృత్వంలో రెండు రోజులుగా అక్రమ మైనింగ్‌పై దాడులు కొనసాగుతున్నాయి. వేముల పరిధిలో నాలుగు చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్‌ కొనసాగిస్తున్న 4 క్రేన్లను స్వాధీనం చేసుకొని వేముల పోలీసుస్టేషన్‌లో భద్రపర్చారు. చంద్రశేఖర్‌ గుప్తా, బ్రహ్మానందరెడ్డి, నాగరాజుకు చెందిన క్రేన్లు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. పర్మినెంట్‌గా క్రేన్లు బిగించి మైనింగ్‌ చేస్తున్న అక్రమార్కులను కట్టడి చేయడంలో.. జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

యథేచ్ఛగా దోచుకెళ్లారు...

నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసి, టిఫెన్‌ బైరెటీస్‌ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఖనిజాన్ని దోచుకెళ్లారు. దాదాపు 3,500 టన్నులు వేలంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచగా.. కొందరు పోలీసు అధికారుల సహకారంతో తీసుకెళ్లారు. 50 టన్నుల సామర్థ్యంతో తరలించే 20 లారీల ద్వారా సుమారు రూ.10 కోట్ల విలువైన నిల్వ ఉన్న బైరెటీస్‌ ఖనిజాన్ని రాత్రికి రాత్రి తరలించుకెళ్లారు. ఇదే విషయమై టిఫెన్‌ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసినా 7 నెలలుగా ఎలాంటి చర్యలు లేవు. కంపెనీ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించుకుంటున్నా తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోయారు. అప్పట్లో టీడీపీ నేత పేర్ల శేషారెడ్డి వాహనాల్లో వెళ్లి కెమెరాలు బిగిస్తున్న వారిని సైతం బెదిరించారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు.

వ్యవస్థలు నిర్వీర్యం కావడం వల్లే..

వ్యవస్థలు తనంతటతానుగా రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడే కొంతలో కొంతైనా ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. వ్యవస్థలు నిర్వీర్యం అయితే దౌర్జన్యపరులదే రాజ్యం, దోపిడీ దారులదే భోజ్యం అన్నట్లుగా ఉండిపోతుంది. సీసీ కెమెరాలు బిగిస్తుంటే టిఫెన్‌ బైరెటీస్‌ ప్రతినిధులను పేర్ల శేషారెడ్డి అండ్‌కో బెదిరింపులకు పాల్పడుతూ, తలకాయలు తీస్తామంటూ హెచ్చరికలు చేసినప్పుడే స్పందించాల్సి ఉంది. పోనీ, సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఖనిజాన్ని దోపిడీ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. వేముల, వేంపల్లె మండలాల్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఏకంగా సీఎం చంద్రబాబుకు జూలై చివరలో ఫిర్యాదు చేశారు. సీఎంఓ ఫిర్యాదు మేరకు 6 వారాలకు అధికారుల్లో చలనమొచ్చింది. సీఎంఓ ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దాడులు చేస్తున్నట్లు వీఆర్‌ఎస్‌ ఏడీ సుబ్రమణ్యం మీడియాకు చెప్పడం గమనార్హం.

వేముల: వేముల సమీపంలోని కుమ్మరగుట్ట వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌లపై భూగర్భగనుల శాఖ అధికారులు రెండు రోజుల పాటు దాడులు చేశారు. గురు, శుక్రవారాలలో భూగర్భగనుల శాఖ ఏడీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మైనింగ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలు జరిపే మైనింగ్‌ల నుంచి నాలుగు క్రేన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మైనింగ్‌లపై ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతుండటంతోనే అధికారులు దాడులు చేశారు.

అనుమతుల్లేని మైనింగ్‌లపై

దాడులు కొనసాగిస్తాం

అనుమతుల్లేని మైనింగ్‌లపై దాడులు కొనసాగిస్తామని భూగర్భ గనుల శాఖ ఏడీ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంఓ కార్యాలయానికి అక్రమ మైనింగ్‌లపై ఫిర్యాదులు అందాయన్నారు. దీంతోనే అక్రమ ముగ్గురాయి తవ్వకాలు జరిపే మైనింగ్‌లపై దాడులు చేసి నాలుగు క్రేన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మైనింగ్‌లకు సంబంధించి యజమానుల అనుమతి పత్రాలు అందజేస్తే క్రేన్లను రిలీజ్‌ చేస్తామని, అలా కాకుండా అనుమతులు లేనట్లయితే ఈ క్రేన్లను వేలం వేయడం జరుగుతుందన్నారు.

కోట్ల విలువైన బైరెటీస్‌ నిక్షేపాల దోపిడీ

అధికారం అండతోచెలరేగుతున్న తమ్ముళ్లు

అక్రమార్కులను నియంత్రించే చర్యలు శూన్యం

చేష్టలుడిగి చూస్తున్న మైనింగ్‌,పోలీసు అధికారులు

ఎన్సీఎల్టీ ద్వారా వేలంలో కొనుగోలు చేసిన బైరెటీస్‌ ఖనిజం పల్వరైజింగ్‌ మిల్స్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కనీస విచారణ చేపట్టలేదు. ఆయా మినరల్స్‌ కంపెనీల్లో ఉన్న స్టాకు ఎంత? ఎవరి మైనింగ్‌ నుంచి ఎంత మోతాదులో కొనుగోలు చేశారు? పల్వరైజింగ్‌ మిల్స్‌ పౌడర్‌గా చేసి ఏ స్థాయిలో పంపించారు? ఇలాంటి రికార్డులు పరిశీలిస్తే లూఠీ వ్యవహారం నిగ్గుతేల్చే అవకాశం ఉంది. అలాంటి చర్యలు చేపట్టాలనే ఆలోచన జిల్లాలోని అటు మైనింగ్‌, ఇటు పోలీసు శాఖకు లేకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. స్వయంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనైనా జిల్లా అధికార యంత్రాంగంలో చలనం లేదు. తాజాగా మైనింగ్‌, రీజినల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌, పోలీసుశాఖ సంయుక్తంగా దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలను కట్టడి చేయాల్సిందిగా పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం 1
1/4

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం 2
2/4

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం 3
3/4

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం 4
4/4

● నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement