జయహో శ్రీచరణి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ప్రపంచ కప్ విజేతగా నిలిచి తిరిగి తన సొంత గడ్డకు చేరుకున్న నల్లపురెడ్డి శ్రీచరణికి క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన సత్కార కార్యక్రమం వేడుకగా సాగింది. అభిమానుల హర్షద్వానాల మధ్య మైదానంలోకి అడుగుపెట్టిన శ్రీచరణికి.. జయహో శ్రీచరణి అంటూ జేజేలు పలికారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్సార్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప శాసనభ్యులు ఆర్.మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.భరత్‌రెడ్డి, అవ్వారు రెడ్డిప్రసాద్, క్రికెట్ స్టేడియం చైర్మన్ ఆర్.శ్రవణ్‌రాజ్‌రెడ్డి, కార్యదర్శి సంజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీచరణి ప్రస్థానం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి తెలియజేశారు. అనంతరం శ్రీచరణీ మాట్లాడుతూ కడప జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా వాసులు తమ ప్రేమాభిమానులు చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీచరణితో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. బ్యాట్లు, బాల్స్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అనంతరం శ్రీచరణిని నిర్వాహకులు, అతిథులు ఘనంగా సత్కరించారు. కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా రూ. 5 లక్షల చొప్పున ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక, బంధుమిత్రులతోపాటు ఇన్‌చార్జి నగర మేయర్ ముంతాజ్‌బేగం, వ్యాయమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డితోపాటు పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
శ్రీచరణిని ఊరేగింపుగా తీసుకొస్తున్న క్రీడాభిమానులు శ్రీచరణితోపాటు తల్లిదండ్రులకు ఆత్మీయ సత్కారం
ప్రపంచ కప్ విజేతకుఅపూర్వ స్వాగతం
అడుగడుగునా జేజేలు పలికిన ప్రజలు
నగరంలో భారీ ర్యాలీ
స్టేడియంలో ఘన సత్కారం
జయహో శ్రీచరణి


