
పెద్ద దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘అమీన్ పీర్ దర్గా‘ ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో అమీన్‌పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు, ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యం కలిగిన అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను కడప నగర ఫెస్టివల్‌గా, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా స్టాండర్డ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.15 రోజుల ముందుగానే ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు, దర్గా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉరుసు ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ విధులు కేటాయించారు.
మున్సిపల్ అధికారులు: ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమలను చేపట్టాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలన్నారు. మొబైల్ టాయిలెట్స్, సురక్షితమైన తాగునీరు, హై మాస్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన కూడళ్లను అందంగా విద్యుత్ లైట్లతో అలంకరించాలని సూచించారు.
పోలీస్ శాఖ: పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రెవెన్యూ శాఖ: పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో.. ఎక్కువగా గుమికుడే ప్రాంతాలలో బారికేడ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా నుంచి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్ వెళ్లడానికి గ్రీన్ ఛానల్ దారిని ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ ప్రొటోకాల్, ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు దర్గా ఆహ్వానాలు వంటి అంశాలను చూసుకోవాలని డీఆర్‌ఓను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 108 అంబులెన్స్ తదితర వాహనాలతోపాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.
పర్యాటక శాఖ: నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, ఎయిర్‌ఫోర్ట్ ప్రాంతాలలో పెద్ద దర్గా, ఇతర దేవాలయాల టెంపుల్ టూరిజం క్యాంపెయిన్ చేపట్టాలని పర్యాటక అధికారులకు సూచించారు.
ఆర్టీసీ : ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితరాల నుంచి అమీన్ పీర్ పెద్ద దర్గా ప్రాంతానికి షటిల్, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మన జిల్లా నుంచే కాకుండా ఇతర రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు.
విద్యుత్ శాఖ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పవర్ మేనేజ్‌మెంట్ చేయాలన్నారు. షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అగ్నిమాపక శాఖ: ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ: అమీన్ పీర్ దర్గా ప్రధాన ఉరుసు మహోత్సవం రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గతంలో పెద్ద దర్గా ఉర్సు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మల్టీ డిస్ప్లేనరీ కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని, ఇందులో ఏడు శాఖలకు చెందిన అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు.
● ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ ఆఫీసర్ ఇదయతుల్లా, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, జిల్లా సమాచార శాఖ అధికారి పద్మజ, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నాగరాజు, జిల్లా అగ్నిమాపక అధికారి ధర్మారావు, కడప మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్, ఇతర జిల్లా అధికారులు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి