
పెండ్లిమర్రి ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్
కడప అర్బన్ : పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జి.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈనెల 17న కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ తమ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని తమ దృష్టికి వచ్చిందని డీఐజీ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 30న పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మృతుడు సుబ్బయ్య భార్య సుధా లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు 194 బి.ఎన్.ఎస్.ఎస్ (మరణానికి కారణం తెలియదు) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 29న పెండ్లిమర్రి మండలం, మాచనూరు సమీపంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన సుధా సుబ్బయ్య(46) అనే వ్యక్తి బాల అంకిరెడ్డికి చెందిన స్థలంలో మృతదేహమై కనిపించాడు. దీంతో మృతుని భార్య సుధా లలిత తన భర్త మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అయితే మృతుడు వడదెబ్బ కారణంగా మరణించి ఉండవచ్చని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. ఈ ఏడాది మే 23న కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుధాకర్ నుంచి ఎస్‌ఐకి పోస్ట్‌మార్టం సర్టిఫికేట్ లభించింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిక ఆధారంగా మృతుడు ‘ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రయోగం‘ కారణంగా మరణించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల3న మృతుడు సుధా సుబ్బయ్య తండ్రి సుధా నారాయణ ఎస్పీని, ఉన్నతాధికారులను సంప్రదించారు. తన కుమారుడు సుధా సుబ్బయ్యను బాల అంకిరెడ్డికి చెందిన వేరుశనగ కొట్టే ప్రదేశానికి తీసుకెళ్లారని, అక్కడ అతనికి విషం ఇచ్చి చంపారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు బాల అంకి రెడ్డి పారిపోయాడని సుధా నారాయణ పేర్కొన్నారు. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి మాత్రం సుధా సుబ్బయ్య వడదెబ్బ కారణంగానే మరణించడంటూ వాదిస్తూ వచ్చారు. దీంతో ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్, కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డిని విచారణ చేయాలని ఆదేశించారు. ఆయన విచారణ చేసి, ఎస్పీ ద్వారా కర్నూలు రేంజ్ డీఐజీకి నివేదిక పంపారు. దీంతో ఆయన ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్