
● జిల్లా వ్యాప్తంగా..
కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహ రిస్తోంది.. నిజాలు రాసే కలంపై కక్ష కట్టింది.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తోంది.. ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలు ప్రచురిస్తున్న ‘సాక్షి’ని వేధింపులకు గురి చేస్తోంది.. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది.. ఈ నేపథ్యంలో కలం నిరసన గళం విప్పింది.. ‘సాక్షి’కి మద్దతుగా జర్నలిస్టులు కదం తొక్కారు.. ‘సాక్షి’పై అక్రమ కేసులు, వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. ఇప్పటికై నా మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించు
కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
కడప కార్పొరేషన్: నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు.. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జి మస్తాన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన కడపలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియాపై వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జి మస్తాన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. రాసిన వార్తల్లో ఏవైనా తప్పులుంటే ఆధారాలు చూపి ఖండన కోరవచ్చు, అంతేగానీ అధికారముందని అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సాక్షి కార్యాలయాలకు వెళ్లి నోటీసుల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మనుగడకు ఇది చాలా ప్రమాదమన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ‘సాక్షి’ మీడియాపై అక్కసు ప్రదర్శిస్తోందన్నారు. చీటికీ, మాటికీ జర్నలిస్టులను బెదిరించేలా పోలీసులతో.. వారి ఇళ్లలో సోదాలు చేస్తూ, నోటీసులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం మీడియా సంస్థలను కూడా విభజించి తమకు అనుకూలంగా ఉన్న మీడియాపై ఒక విధంగా, వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాపై మరొక రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి సరికాదన్నారు. సాక్షి ఽఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్‌రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన కడపలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు రామాంజనేయరెడ్డి, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, శివరామ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, కెమెరామెన్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేతలు పి. జయచంద్రారెడ్డి, పాకా సురేష్, పులి సునీల్‌కుమార్, సీహెచ్ వినోద్, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, బి.మరియలు, మల్లీశ్వరి, సుజిత, శివమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కడి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. పులివెందులలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి, ఆర్‌డీఓకు వినతి పత్రం సమర్పించారు.
పత్రికా స్వేచ్ఛపై దాడితగదంటూ ఆందోళన
‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యల పట్ల మండిపాటు
అక్రమ కేసులు, వేధింపులపై ఆగ్రహం
కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజం
కదం తొక్కిన జర్నలిస్టులు
అధికారులకు వినతిపత్రాలు అందజేత

● జిల్లా వ్యాప్తంగా..

● జిల్లా వ్యాప్తంగా..