
సర్పంచ్‌కు గాయాలు
వేంపల్లె : బొలెరో వాహనం ఢీకొని బక్కన్నగారిపల్లె సర్పంచ్ మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల వివరాల మేరకు.. సర్పంచ్ మల్లయ్య పులివెందులలో నుండి తన సొంత పనులను ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్నారు. వేంపల్లె నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో మల్లయ్యకు చేయి విరి గి గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. మల్లయ్యను వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి రూ.6.03 లక్షల ఆదాయం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో టెంకాయలను విక్రయించేందుకు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 9 మంది పాల్గొనగా టి.సుమలత రూ.6,03,000లకు టెంకాయల అంగడిని దక్కించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి 2026 నవంబర్, 22వతేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు ఆమెకు హక్కు ఉంటుందని దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు. గత ఏడాది వచ్చిన ఆదాయంతో పోల్చితే అదనంగా రూ.1,30,000 వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
ఝరికోనలో మృతదేహం
కలకడ : మండలంలోని బాలయ్యగారిపల్లె సమీపంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సర్పంచ్‌కు గాయాలు