
మతోన్మాదుల కుట్రతోనే సీజేఐపై దాడి
కడప కార్పొరేషన్ : మతోన్మాదుల కుట్రతోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై దాడి జరిగిందని ప్రముఖ న్యాయవాది ఎ.సంపత్‌కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, డా.మల్లె భాస్కర్ ఆరోపించారు.
జన విజ్జాన వేదిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 19న పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా పౌర సమాజం ఆధ్వర్యంలో ఈ సదస్సుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్, జన విజ్ఞాన వేదిక ఫౌండర్ డాక్టర్ బ్రహ్మారెడ్డి ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అత్యంత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖజురహో ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిందని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మార్పుచేర్పులు చేయడానికి సాధ్యపడదన్నారు. పరిపాలనా పరంగా తిరస్కరణకు గురైన అంశంపై న్యాయస్థానం పరిష్కారం చూపడం సాధ్యం కాదన్న గవాయ్ వ్యాఖ్యల్ని వక్రీకరించి పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్య పరిచి సమాయత్తం చేయాలనే ఆలోచనతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యావంతులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాతంత్ర శక్తులు సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ నగర అధ్యక్షుడు వెంకటశివ, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
19న దాడి ఘటనను ఖండిస్తూ సదస్సు