ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం

Oct 17 2025 6:10 AM | Updated on Oct 17 2025 6:10 AM

ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం

ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు

వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

పులివెందుల : రాష్ట్రంలోని 17 మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పులివెందులలో గురువారం ప్రారంభమైంది. స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో పులివెందుల మున్సిపాలిటీ, రూరల్‌, తొండూరు, లింగాల, సింహాద్రిపురం మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డిలు సమావేశం నిర్వహించారు. అంతకముందు ఆడిటోరియంలోని వైఎస్సార్‌ విగ్రహానికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఎంపీ అవినాష్‌రెడ్డి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పప్పులు, బెల్లాలు మాదిరిగా ప్రైవేట్‌ యాజమాన్యాలకు ఇస్తున్నారన్నారు. పులివెందుల మెడికల్‌ కళాశాలకు సంబంధించిన 50 ఎకరాలకు చంద్రబాబు నిర్ణయించిన మేరకు ఏడాదికి అద్దె రూ.5వేలు అన్నారు. అక్కడ రూ.300 కోట్ల విలువ చేసే బిల్డింగ్‌లు ఉన్నాయని, దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే స్థలం, మొత్తం నాలుగైదు వందల కోట్ల ఆస్తిని ఈ మాదిరి సంవత్సరానికి రూ.5వేలకు అద్దెకు ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రైవేట్‌ యాజమాన్యానికి ఉచితంగా వైద్యం చేయాలన్న శ్రద్ధ ఎక్కడ నుంచి వస్తుందన్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో కూడా కొంత కోటా సీట్లు ఉచితంగా ఇవ్వాలని చట్టంలో ఉందని, కానీ ఆ చట్టాన్ని ఎవరూ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు దాదాపు 96 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో 12 మెడికల్‌ కళాశాలల్లో 2200 మెడికల్‌ సీట్లు ఉండేవన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ కళాశాలల ద్వారా 2,500 మెడికల్‌ సీట్లు అదనంగా రాగా.. ప్రస్తుతం 4,700 మెడికల్‌ సీట్లు అయ్యాయన్నారు. జగనన్న ప్రభుత్వం విద్యపైన, వైద్యంపైన ఎంత శ్రద్ధ వహించిందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థంభించిన ఆరోగ్య శ్రీ సేవలు

రాష్ట్రంలో గత 5 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు స్థంభించాయని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఈ ప్రభుత్వం రూ.3,500 కోట్ల బకాయిలు పడిందన్నారు. దీంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలుపుదల చేశాయన్నారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఫీజులు చెల్లించకపోతే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడంలేదన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

చంద్రబాబుకు మ్యాటర్‌ వీక్‌..

ప్రచారం పీక్‌: ఎస్వీ సతీష్‌ కుమార్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు మ్యాటర్‌ వీక్‌ – ప్రచారం పీక్‌ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇటీవల కర్నూలులో మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ – సూపర్‌ హిట్‌ అని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన చెప్పినట్లు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు కావాలంటే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అయితే గడిచిన 16 నెలల కాలంలో రూ.17వేల కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా హామీలన్ని అమలు చేశానని చెప్పుకునే దరిద్రమైన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆడవారికి ఏడాదికి రూ.18వేలు అన్నారని, కేవలం ఈ పథకానికే రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 50ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పింఛను పథకాన్ని కూడా అటకెక్కించారన్నారు. ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యంలో టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు ఏడాదికి రూ.5వేల కోట్లు వచ్చే మార్గం చెబుతానని చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నాకే ఎమ్మెల్యే టిక్కెట్‌ కేటాయించారన్నారు. ఆ ఒప్పందం మేరకే ప్రస్తుతం నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్‌ కళాశాల ఉండాలనే సదుద్దేశంతో వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కళాశాలలను తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబు గతంలో 14ఏళ్లు సీఎంగా ఉన్నారని, మళ్లీ ఇప్పుడు సీఎంగా ఉన్నారని, ఒక్క మెడికల్‌ కళాశాలను కూడా తీసుకురాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement