
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రొద్దుటూరు:స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్‌సీ అర్హత కలిగి ఉర్దూ మీడియంలో జువాలజీ ఉర్దూ, సివిక్స్ ఉర్దూ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 25న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
సుబ్బరాయుడు సేవలు చిరస్మరణీయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాయలసీమకు కృష్ణా నదీ జలాల మళ్లింపు కోసం నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం మాజీ అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకుడు రూక అశోక్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గాలి చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఎం అనుబంధ రైతు సంఘం నాయకుడు దస్తగిరి రెడ్డి తదితరులు కొనియాడారు. గురువారం నగరంలోని ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాల్‌లో ఇటీవల మరణించిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బరాయుడు నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న సందర్భంలో నీటి లభ్యత, నీటి అవసరాలు అనే అంశంపై నిరంతరం అధ్యయనం చేయడమే కాకుండా ఉద్యమకారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేవారన్నారు. సుబ్బరాయుడు ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు, కేసీ కెనాల్ చివరి అయకట్టు స్థిరీకరణకు రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి నోచుకోకపోవడం విచారకరమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ, సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, మునయ్య, యానాదయ్య, కృష్ణమూర్తి, నాగిరెడ్డి, భద్రయ్య, గురవయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.