
కోత మిల్లులపై విజిలెన్స్ విచారణ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సామిల్లు (కోత మిల్లు)లపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లులను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ డీఎఫ్‌ఓ ధర్మరక్షిత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విచారణ చేపట్టారు. సా మిల్లులు రిజర్వ్ ఫారెస్ట్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఉండాలి. అయితే పట్టణంలోని మిల్లులు 5 కిలోమీటర్ల లోపలే ఉన్నాయనేది ప్రధాన ఫిర్యాదు. ప్రొద్దుటూరులో 17 సా మిల్లులు ఉండగా అందులో 6 మిల్లులకు లైసెన్స్ గడువు ముగిసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరులోని పలు కోత మిల్లులను పరిశీలించారు. మిల్లుల యజమానులను కార్యాలయాలకు పిలిపించి లైసెన్స్‌లు, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. కొందరు మిల్లుల యజమానులు అటవీశాఖ అనుమతి లేకుండా లైసెన్స్‌లో ఉన్న చోటు కాకుండా మరో చోటికి మార్చినట్లు అధికారులు గుర్తించారు. మిల్లుల యజమానులు కొందరు లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోకుండానే నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు విచారణ జరిగింది. స్థానిక అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తునట్లు తెలుస్తోంది. అనంతరం ఏకో పార్కులో జరుగుతున్న నగరవనం పనులను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి, డీఆర్‌ఓ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.