
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
జమ్మలమడుగు రూరల్/మైలవరం : కుటుంబ సమస్యలతో తన ముగ్గురు పిల్లలు, తాను కలసి మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన మహిళను పోలీసులు కాపాడిన సంఘటన మైలవరం మండలంలో జరిగింది. ఏఎస్‌ఐ లక్ష్మీరెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన మహేశ్వరిని తల్లిదండ్రులు నొస్సం గ్రామానికి చెందిన వెంకట శివకు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వెంకట శివ పట్టణంలోని ప్రైవేట్ ఫైనాన్స్‌లో (డబ్బులు వసూలు చేయడం)లో విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి 8, 5, 2 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు నంద్యాల జిల్లా, సంజామల మండలం నొస్సం గ్రామంలో కాపురం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు రావడంతో జీవితంపై విరక్తి చెంది మైలవరం జలాశయంలో ముగ్గురు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె జలాశయం కట్టమీదకు చేరుకుంది. గమనించిన మైలవరం అటో డ్రైవర్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రియాజ్, రమేష్, హృదయ్ అనే సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలుచుకొని వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం భార్యాభర్తలకు ఏఎస్‌ఐ లక్ష్మీరెడ్డి, సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు.
మహిళ, ముగ్గురు పిల్లలను కాపాడిన పోలీసులు