
పీఠాధిపతిని నియమించాలి
కడప రూరల్ : కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కొలువైన బ్రహ్మంగారిమఠానికి పీఠాధిపతిని నియమించి భక్తుల మనోభావాలను గౌరవించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ కోరారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి గతించి నాలుగేళ్లు అయిన్పపటికీ నేటికీ పీఠాధిపతి నియామకం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సాధారణంగా ఏ పీఠంలో అయినా పీఠాధిపతి గతిస్తే సత్వరమే తాత్కాలిక పీఠాధిపతిని నియమించి పీఠం కార్యకలాపాలు కొనసాగిస్తారన్నారు. తాజాగా కోర్టు కూడా సత్వరమే తాత్కాలిక పీఠాధిపతిని నియమించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బ్రహ్మంగారిమఠం పీఠానికి శాశ్వత పీఠాధిపతిని నియమించాలని, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు స్వామిజీలు, భక్తులు పాల్గొన్నారు.