
ప్రజాస్వామ్యంపై పోలీసు పోటు
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదు. ఇది పత్రి కా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే పరిణించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. జిల్లాలో కూడా సాక్షి జర్నలిస్టులపై పదేపదే పోలీసులు కేసులు పెట్టి ఏదో ఒకరకంగా వేధించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం.
– పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఆంధ్ర
ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
సాక్షి కడప: ప్రజాసామ్యంలో కీలకమైన పత్రికాస్వేచ్ఛపై పోలీసుల జులుం కొనసాగుతోంది. వార్తలు రాస్తే అడుగడుగునా వేధింపులు....మరోవైపు నోటీసుల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారంపై వార్త రాశారన్న అక్కసుతో పోలీసులు ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డికి నోటీసుల నెపంతో హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్ చల్ చేశారు. అంతేకాకుండా విచారణ పేరుతో సాక్షి ఎడిటర్‌ను ఇబ్బందులకు గురిచేయాలని చేయడంతోపాటు ఏదో ఒక రకంగా వేధింపులే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశారు. మరోవైపు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోనూ సాక్షి జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా జర్నలిస్టులకు ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో కూడా సాక్షి ప్రతినిధులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ప్రధానంగా ఇటీవల సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో....ఎలాంటి విపత్కరపరిస్థితులు లేకపోయినా వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వేములలో జిల్లా సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్‌తోపాటు మిగతా సాక్షి జర్నలిస్టులపై కూడా దాడులకు పూనుకున్నారు. ఇవే కాకుండా సాక్షి జిల్లా బ్యూరో ఇన్‌చార్జి ఎం.బాలకృష్ణారెడ్డిపై కూడాజిల్లాలో పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
వెల్లువెత్తుతున్న నిరసనలు
నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో తెలియక కూటమి సర్కార్ అడ్డదిడ్డంగా ముందుకు పోతోంది. ఈ నేపథ్యంలోనే సాక్షిలో వార్తలు రాస్తున్న పత్రికా ప్రతినిధులు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి కూడా కేసులు నమోదు చేసి నోటీసుల నెపంతో హంగామా సృష్టిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై అటు అన్నమయ్య, ఇటు వైఎస్సార్ జిల్లాలో సీనియర్ జర్నలిస్టులు, పలు సంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు మంచివి కాదని, వార్తలు రాస్తే న్యాయపరంగా ముందుకు వెళ్లాలే తప్ప కేసులు పెట్టడం, అరెస్టులు, వేధించడం లాంటివి మంచి పద్ధతి కాదని పలువురు సూచిస్తున్నారు. కూటమి సర్కార్ ఇలాంటి ధోరణి అవలంభిస్తే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రజాస్వామ్య వాదులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సాక్షికార్యాలయంలో పోలీసుల హల్‌చల్
ఎడిటర్‌కు నోటీసుల పేరుతో హంగామా
జిల్లాలోనూ పలు సందర్భాల్లో సాక్షి కరస్పాండెంట్,ఇతర జర్నలిస్టులపై దాడులు

ప్రజాస్వామ్యంపై పోలీసు పోటు

ప్రజాస్వామ్యంపై పోలీసు పోటు