
దళితుల శ్మశాన వాటికకు దారేది?
అతికష్టంపై మృతదేహాన్ని తరలించిన కుటుంబీకులు
చాపాడు : దాతలు ముందుకు వచ్చి శ్మశాన వాటికకు స్థలం కేటాయించినా.. కొందరి నిర్వాకంతో ఆప్రాంతానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. మంగళవారం అతికష్టంపై ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాల్సి రావడంపై దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని పడమర అనంతపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున దళితవాడకు చెందిన బుస్సా కనకమ్మ(58) మృతిచెందింది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం దళితవాడ నుంచి కిలోమీటరు దూరంలో ఉండే శ్మశాన వాటికికు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దారి లేకపోవడంతో వరి పైరు పొలాల్లో అతి కష్టంపై వెళ్లాల్సి వచ్చింది. తమ పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని స్థానిక రైతులు కొందరు అడ్డు చెప్పడంతో ఎలా తీసుకెళ్లాలో తెలియక తరచూ ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా దారి ఏర్పాటుచేయలేదని, అగ్రవర్ణాల వారు తమకు సహకరించడం లేదని దళితులు తెలిపారు. ఇప్పటికై నా స్పందించి దారి ఏర్పాటుచేయాలని వారు వేడుకొంటున్నారు.