
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఆళ్లగడ్డ(నంద్యాల జిల్లా) : అతి వేగం, అపై నిద్రమత్తు ఒకరిని బలితీసుకుంది. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని గూబగుండం మెట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆళ్లగడ్డ పట్టణ ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన పిచ్చిరెడ్డి తిరుపతిలోని ఓ కారు షో రూంలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేయడంతో పిచ్చిరెడ్డి ఆ కారును డెలివరీ ఇచ్చేందుకు శనివారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరాడు. మార్గంమధ్యలో కడప దగ్గర నంద్యాలకు వెళ్లేందుకు నజీర్ హుస్సేన్, శ్రీను అనే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గూబగుండం మెట్ట సమీపంలోకి వచ్చే సరికి.. కారు నడుపుతున్న పిచ్చిరెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న నజీర్‌హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా పిచ్చిరెడ్డి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన నజీర్ హుస్సేన్ కడప వాసిగా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ప్రాణం తీసిన నిద్రమత్తు