
గంగమ్మకు బోనాలు
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పూజారులు చెల్లు గంగయ్య సురేంద్ర కుటుంబ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపారు. భక్తులు బోనాలు సమర్పించారు. గంగమ్మా.చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు.కొందరు తలనీలాలు అర్పించారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు వారి సిబ్బందితో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి అమ్మవారి విశిష్టతను పూజారులు వివరించారు. అలాగే మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీశ్రీ మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెడ్డెమ్మా..కరుణించమ్మా
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అమ్మా..చల్లంగా చూడమ్మా అని భక్తులు వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించు కొన్నారు. పలువురు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆల యానికి హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.