
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం
కడప అర్బన్ : కడప నగరం రాజంపేట బైపాస్‌లోని రామాంజనేయ పురం వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ లోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్లు కడప అగ్నిమాపక శాఖ అధికారి యోగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కడప నెహ్రు నగర్ కు చెందిన మాలే శివకు చెందిన 14 టైర్ల లారీని రామాంజనేయపురం పెట్రోల్ బంక్ సమీపంలో పార్కింగ్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి లారీ బ్యాటరీ వద్ద వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. బాధితుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దాదాపు రూ.20 లక్షల మేర నష్టం జరిగినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన నారాయణ(50) శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న తన కుమార్తె భావన(20)ను బైక్‌లో ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా, చిప్పిలి సమీపంలో బెంగళూరు నుంచి రాయచోటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మల్లిక (28) వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.