
వైద్య రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు
కడప రూరల్ : వైద్య రంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐఎంఏ హాల్ నుంచి ఏడు రోడ్ల కోడలి వరకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ వైద్య సేవలు, వ్యక్తిగత ఆరోగ్య భీమా పాలసీ ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్స్‌పై కూడా పన్ను మినహాయింపు ఉందన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఆఫీసర్ పద్మావతి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అవార్ అర్జున్, డాక్టర్ శశి భూషణ్ రెడ్డి, డాక్టర్ ఉమా మహేశ్వర కుమార్, డాక్టర్ రవిబాబు, డెమో భారతి, జిల్లా మలేరియా అధికారి మనోరమ, పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.