
ఉల్లి రైతులను ఆదుకోవాలి
వీరపునాయునిపల్లె : ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వీఎన్ పల్లె మండలంలోని ఉల్లి పంట సాగు చేసిన రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం బాధాకరమన్నారు. పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడంతో భారీగా నష్టపోతున్నారని అటువంటి సమయంలో మద్దతు ధర ప్రకటించడంతో పాటు సొంతంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వానిదేనన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఊరు కోవడం దారుణమని ధ్వజమెత్తారు. మార్క్‌పెడ్ ద్వారా క్వింటాల్ రూ.12వందలతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు కొనుగోలు ప్రారంభించకపోవడంపై మండిపడ్డా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరటి, చీని, బొప్పాయి, ఉల్లి లాంటి అన్ని పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్షాలు అధికంగా కురిసి ఉల్లి పంట దెబ్బతిన్న విషయం తెలుసుకొని కేవలం 20రోజుల్లోనే పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరతో కొనుగోలు చేయడమా లేక హెక్టారుకు 50వేల రూపాయలు అందించాలని డిమాండు చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గురువారం 10గంటలకు రైతులతో వెళ్లి కలెక్టర్‌ను కలుస్తామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తామని వివరించారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్‌ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ వీరప్రతాప్‌రెడ్డి, జిల్లా రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ రైతు నాయకుడు భాస్కర్ రెడ్డి, కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రాజు పాలెం జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచులు వెంకటరెడ్డి, నరేష్‌రెడ్డి, సౌజన్యరెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసుల్‌రెడ్డి, రవి, సుధాకర్‌రెడ్డి, శివాంజనేయరెడ్డి, వీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.