
కడప ‘దేశం’లో కల్లోలం !
● ఇటీవల నియమించిన
నగర కమిటీపై తమ్ముళ్ల ఆగ్రహం
● కార్యకర్తల అసంతృప్తిపై
అధిష్ఠానం ఆరా
● మరోమారు అభిప్రాయ సేకరణ
కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకెత్తయితే.. కడప నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు అంతకుమించి ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడపలో జరిగే పార్టీ వ్యవహారాలు.. ఆధిపత్య గొడవలు ఆ పార్టీ అధిష్ఠానాన్నే కలవరపెట్టే స్థాయికి చేరాయి. తాజాగా కడప నగర కమిటీ నియామకం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఇటీవల కడప నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్‌తోపాటు ఇతర సభ్యుల నియామకానికి చర్యలు చేపట్టారు. ఆ మేరకు అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అప్రూవ్, రిజెక్ట్ అనే ఆప్షన్స్ ద్వారా కార్యకర్తల నిర్ణయాలను సేకరించారు. ఈ సందర్భంగా దాదాపు 70 శాతానికి పైగా కార్యకర్తలు రిజెక్ట్ ఆప్షన్‌ను ఎంచుకున్నట్లుగా ప్రచారం సాగింది. ఈ అంశాన్ని ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు బహిరంగంగానే అధికార పార్టీకి చెందిన గ్రూపుల ద్వారా తెలియపరిచారు. తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి, కడప నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్‌తోపాటు ఇతర కార్యవర్గాన్ని నియమిస్తూ నూతన కమిటీని ప్రకటించారు. ఈ జాబితాపై పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము రిజెక్ట్ చేసిన అభ్యర్థులనే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆమోదింపజేశారని మండిపడ్డారు. ఈ నగర కమిటీకి పార్టీ అధిష్ఠానం అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ కమిటీపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలో సీనియర్ కార్యకర్తలు ఎవరూ లేరంటూ ఆరోపించారు.
మళ్లీ అభిప్రాయ సేకరణపై ‘రిజెక్ట్’ ఎఫెక్ట్..?
ఈ తరుణంలో బుధవారం ఆ కమిటీని రద్దు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ అంశాన్ని టీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పంచుకున్నారు. అదే సందర్భంలో పార్టీ అధిష్ఠానం రద్దు చేసిన కమిటీలో ఉన్న వ్యక్తుల పేర్లనే సూచిస్తూ మరోమారు అభిప్రాయ సేకరణ కోరింది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, జాబితాలోని సభ్యులను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం తాజాగా కడప తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆటలు అధిష్ఠానం వద్ద సాగడం లేదు. అందువల్లే కమిటీని రద్దుచేసి మళ్లీ అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లుగా తమ్ముళ్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అంశాలు పార్టీలో సంచలనంగా మారాయి.