
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈపీఎఫ్ 95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 12న ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలపై నిర్వహిస్తున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం పెన్షన్ భిక్ష కాదు, ఒక హక్కు అని గతంలో తేల్చి చెప్పినా పెన్షన్ రూపు మార్చి మోసాలకు పాల్పడుతున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో కనీసం పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. 12వ పిఆర్సీ కమిషనర్‌ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఈ సదస్సుకు పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత కో ఆర్డినేషన్ నాయకులు ఎం.జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు హాజరవుతున్నట్లు తెలిపారు. అన్ని రంగాల పెన్షనర్లు పాల్గొని సదస్సు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రామ్మూర్తినాయుడు, కళ్యాణ్ సుధాకర్, సాంబశివారెడ్డి, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.