
ధర తగ్గించి.. దళారులు దోచేస్తున్నారు
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రభుత్వం క్వింటాకు రూ.2369 ప్రకటించినప్పటికీ, దళారులు కేవలం రూ.1340 లతో కొనుగోలు చేస్తున్నారని వేంపల్లె మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె, కుమ్మరాంపల్లె, ఇడుపులపాయ, వీరన్నగట్టుపల్లె గ్రామా లరైతులు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తారని, అయితే గిట్టుబాటు ధర లేక వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లోనే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పోతిరెడ్డి శంకరయ్య, వెంకట నారాయణరెడ్డి, బత్తల గంగాధర, తదితరులు పాల్గొన్నారు.
పంట మద్దతు ధరపై కలెక్టర్‌తో చర్చించిన ఎంపీ
పంట మద్దతు ధరపై పలువురు రైతులు మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో మాట్లాడారు. గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను సావధానంగా ఆలకించిన ఎంపీ ఈ విషయమై కలెక్టర్ శ్రీధర్, జేడీఏ చంద్రానాయక్‌తో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదని.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కలెక్టర్, జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వేంపల్లె రైతులు