
నారావారి సారాపై కేంద్రం దృష్టి సారించాలి
● జిల్లా ఎస్పీ ని కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
● పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపీ
నాయకులపై నమోదు చేసిన
అక్రమ కేసులపై ఎస్పీకి వివరించిన
ఎంపీ
కడప అర్బన్ : రాష్ట్రంలో నారా వారి సారా (ఎన్ బ్రాండ్) పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని.. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం పెద్దలను సమగ్రంగా విచారణ జరిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను కలిశారు. పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులపై ఎస్పీకి వివరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడా రు. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం కుంభకోణంతో నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో బహిర్గతమైందన్నారు. 111 కోట్ల క్వార్టర్ బాటిళ్లు అమ్ముడు పోతే వీటిల్లో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు నకిలీ మద్యానికి సంబంధించినవేననీ, సుమారు రూ. 5280 కోట్ల విలువైన అమ్మకాలు నకిలీ మద్యం రూపంలో జరిగాయని ఆరోపించా రు. ఏడాది కాలంలోనే ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ లేకుండా నకిలీ మద్యం అమ్మకాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 5280 కోట్ల కుంభకోణానికి తెర లేపారన్నారు. అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, కృష్ణా జిల్లా సాక్షిగా అవినీతి బట్టబయలైందన్నారు. మొలకలచెరువు నుంచి రాయలసీమకు, కృష్ణా జిల్లా నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని ఆరోపించారు. బాటిళ్లకు వేసే సీళ్లు మాత్రమే ఒరిజినల్ అనీ, సీసాలోని మద్యం మాత్రం నకిలీదనీ తేలి పోయిందన్నారు. ఆధారాలతో అడ్డంగా దొరికినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఇంత అవినీతి జరిగినా కూటమి ప్రభు త్వ నేతలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వానికి నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధంలేదని తయారీదారుని చేత వీడియోలను విడుదల చేయడంలోనే ప్రభుత్వానికి సంబంధం ఉందనీ ఇట్టే తేలిపోయిందన్నారు. అధికార అగ్రనాయ కులు సంప్రదించాకే ఆ వీడియో బయటకు వచ్చిందన్నారు. అగ్ర నాయకులు తనను కాపాడతారనే హామీతో అమాయకంగా ఆ వీడియోను విడుదల చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులను స్థానిక పోలీసులు నమోదు చేశారని, వాటిని వివరించేందుకు ఎస్పీని కలిశామన్నారు.
పంటలకు గిట్టుబాటు ధరను చెల్లించాల్సిందే..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పనిచేసినంతకాలం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రయోజనం చేకూర్చామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదనీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. చక్రాయపేట, వేంపల్లి, మైదుకూరు తదితర ప్రాంతాలలో వరి పండించే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. 81 కిలోలకుగాను రూ. 1000 నుంచి 1300 మాత్రమే అమ్ముడుపోతున్నాయన్నారు. ప్రభుత్వం చొరవతీసుకుని సివిల్ సప్లయిస్ డీఎం ద్వారా వరికి రూ. 2369 లమేరకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. చీనీ, వరి పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. కలెక్టర్‌ను కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. వైఎస్‌సీపీ మాజీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్‌కుమార్, మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీవుల్లా, యువజన విభాగం ప్రశాంత్‌రెడ్డి, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షడు రిక్షిత్ రెడ్డి పాల్గొన్నారు.