కడప కోటిరెడ్డిసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాయచోటి డిపోలో అసిస్టెంట్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఐటీఐలో డీజల్, మోటారు మెకానిక్‌లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికై న వారు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు రాయచోటిలోని డీఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీకి షోకాజ్ నోటీసు
ప్రొద్దుటూరు : రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2021–24 సంవత్సరాలకు సంబంధించి ఆడిట్ చేయించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న విజయవాడలోని స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
నవోదయలో ప్రవేశ దరఖాస్తులకు గడువు పెంపు
తిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఏఐఏఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్తార్ ఫైజీ ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : ఆలిండియా అదబ్ ఎ అత్ఫాల్ సొసైటీ(ఏఐఏఏఎస్) రాష్ట్ర బాల సాహితీ సొసైటీ అధ్యక్షుడిగా ప్రముఖ ఉర్దూ బాల సాహితీవేత్త సత్తార్ ఫైజీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సి. కె. దిన్నె మండలం మూలవంక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తన ఎంపికపై ఫైజీ సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరం లో జష్నే రంగే బచ్చన్ పేరుతో అంతర్జాతీయ ఉర్దూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెమినారు, ముషాయిరా, బాల సాహితి ఉర్దూ పుస్తకాల ఆవిష్కరణ, నాటికలు, పుస్తకాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో ఆరోగ్య రంగానికి ప్రయోజనం
కడప రూరల్ : జీఎస్టీ తగ్గింపు వల్ల ఆరోగ్య రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భవిత భీమా పాలసీ ప్రీమియంపై 18 శాతం జీఎస్టీని పూర్తిగా తగ్గించారన్నారు. ఈ సందర్భంగా సంధ్యా సర్కిల్ కూడలిలో ప్రతిజ్ఞ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఆఫీసర్ పద్మావతి డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వర కుమార్, డాక్టర్ రవిబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ భారతి, మలేరియా అధికారి మనోరమ పాల్గొన్నారు.
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు ఉత్సవమూర్తులను వేర్వేరుగా ఉంచారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతోపాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తరువాత సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.