
భద్రతా నిబంధనలు తప్పనిసరి
కడప సెవెన్‌రోడ్స్ : బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ రూమ్ హాలులో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు తదితర అంశాలపై ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ డివిజన్‌లలో బాణసంచా దుకాణదారులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, అన్ని రకాల భద్రత చర్యలను పాటిస్తూ.. సంప్రదాయ పండుగను సంతోషంగా నిర్వహించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను తప్పకుండా పాటించాలన్నారు. కమ్యూనిటీ ఓపెన్ ఏరియాలలో క్రాకర్స్ వినియోగించేలా చూడాలన్నారు. అలాగే పాఠశాలల్లో పిల్లల కు టపాసుల వినియోగం, భద్రతపై అవగాహన పెంచాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖలు ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలన్నా రు. అలాగే కమర్షియల్ టాక్స్ అధికారులు అన్ని డివిజన్లోని ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. ఎక్కడైనా ఇల్లీగల్ స్టోరేజ్ పాయింట్లు కనపడితే వెంటనే వాటిని సీజ్ చేసి చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో.. బాణసంచా విక్రయ కేంద్రాలకు పరి మిత సంఖ్యలో అనుమతులు ఇవ్వాలని సంబందిత అధికారులకు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా బాణసంచా దుకాణాలు నిర్వహిస్తే.. విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చంద్ర మోహన్,సాయి శ్రీ,చెన్నయ్య జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్ సాయి ధర్మా రావు,అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ ,మున్సిపల్ కమిషనర్లు, ఫైర్, రెవెన్యూ, పోలీసు, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘సూపర్ జీఎస్టీ’పై మరింత అవగాహన
ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందు కెళ్లాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. జిల్లాలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌పై చేస్తున్న అవగాహన కార్యక్రమాల అమలు తీరు పై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ మంగళవారం రాత్రి వీసీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితి సింగ్, జీఎస్టీ జాయింట్ కమిషనర్,జిల్లా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి జి. సుమతి,జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి రోజు చేసిన కార్యక్రమాలపై డేటా ఎంట్రీ ఖచ్చితంగా చేయాలన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో కడప కళా క్షేత్ర ప్రాంగణంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ప్రదర్శన, సేల్స్ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా వైద్య శాఖ అధికారి నాగరాజు,డ్వామా, డీఆర్డిఏ పీడీలు ఆదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, డీఈఓ శంషుద్దీన్,జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి