
‘క్వారీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం’
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి పక్కనే కంకరకు సంబంధించిన మైన్‌లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా చాల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కరించాలని గోవిందంపల్లె గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ యామినిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందంపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ చాల సంవత్సరాలుగా గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలో పెద్ద ఎత్తున పనులు నిర్వహిస్తుండటంతో.. మైన్‌లో భారీ పేలుళ్ల వల్ల వెలువడుతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అనేక మంది రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో పనులు నిర్వహిస్తున్నరని, కాలుష్య నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతే కాకుండా జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, దీంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని రైతులు ఆన్‌లైన్‌కు సంబంధించి భూముల సమస్యలపై తహసీల్దార్‌కు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర్‌రావు, ఆర్‌ఐ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. యువకుడి మృతి
మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని వాల్మీకి వీధికి చెందిన నరసయ్య, రెడ్డెమ్మ దంపతుల రెండో కుమారుడు కృష్ణభగవాన్ (27) టైల్స్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండే వాడు. ఆయన స్నేహితులైన బాబు, విజయ్‌తో కలిసి ఆటోలో బైపాస్‌రోడ్డు మీదుగా పట్టణంలోకి వస్తుండగా, అరేబియా హోటల్ సమీపంలో వేగాన్ని అదుపుచేయలేక ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణభగవాన్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు.

‘క్వారీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం’