
ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం
జమ్మలమడుగు: ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరుతో గండికోట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఒకరేమో అనకాపల్లి ఎంపీ రమేష్‌నాయుడు, మరొకరు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాస్కి నిధుల కింద గండికోట అభివృద్ధి కోసం దాదాపు 78 కోట్ల రూపాయలు కేటాయించారు. టెండర్‌ను రిత్విక్ కంపెనీ లెస్‌కు దక్కించుకుంది. దీంతో మొదటి విడతగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని సంప్రదించకుండా పనులు చేపట్టడంతో స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. సబ్‌కాంట్రాక్ట్ కింద ఇతర జిల్లాలకు చెందిన వారికి పనులు ఇచ్చారంటూ గండికోట వాసులు, స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా అడ్డంకులే...
సాస్కి పథకం కింద గండికోటలో రహదారులు, బోటు షికారు, వసతుల కల్పన తదితర పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి రిత్విక్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. అయినా రెండో సారి పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ పంచాయితి కలెక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ కూడా స్థానికులకే పనులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని సీఎం రమేష్‌నాయుడు, సురేష్‌నాయుడు వ్యతిరేకించారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు ప్రాంత వాసులతో చేయించుకుంటారా అని బీజేపీ, టీడీపీ నాయకులు కంపెనీ కార్యాలయంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీ జరిగిన దాడి తర్వాత గండికోటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక గండికోటలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. పర్యాటకులకు కనీసం తాగు నీరు కూడ కోటలో దొరకని పరిస్థితి ఉంది. పనులు ఆగిపోవడంతో గండికోటలో అభివృద్ధి జరుగుతుందా.. లేక ఆదిపత్యం పోరులో ఆగిపోతుందా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిపోయిన రూ.50 కోట్ల పనులు

ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం

ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం