
రిజిస్ట్రేషన్‌లకు నేడే ఆఖరు
కడప ఎడ్యుకేషన్: వైవీయూ (యోగి వేమన యూనివర్శిటీ)లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో చేరేందుకు రెండో విడత ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 29 తేదీ చివరి రోజు అని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మి ప్రసాద్ వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వెబ్ ఆప్షన్స్ 29వ తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఉంటాయన్నారు. అందులో ప్రధాన ఆప్షన్‌గా వైవీయూను నమోదు చేయాలని సూచించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి ఉప రవాణాశాఖ కమిషనర్ వీర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 4 నాటికి వాహన్ పోర్టల్ ద్వారా వివిధ పనుల కోసం దరఖాస్తు చేసుకుని 10 నెలలు అంత కంటే ఎక్కువ రోజులు అయిన దరఖాస్తులు 279 ఉండేవని, అందులో అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నవి 83 ఉన్నాయని, వాటిని అప్రూవ్ చేశామన్నారు. మిగిలిన 196కు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయామని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డిస్‌ప్లే చేశామని, ఆయా వాహన యజమానులు పూర్తి డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ ను అక్టోబరు 7లోపల అందించాలని కోరారు. అప్పటికీ డాక్యుమెంట్స్ రాని దరఖాస్తులను రద్దు చేస్తామని తెలిపారు.
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సందర్శకులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ఉన్నా సందర్శకుల తాకిడి తగ్గింది. అయితే ఆదివారం రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీనితో గాలిబండ, వ్యూపాయింట్లు నుంచి సందర్శకులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాలను తిలకించారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రజలు 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.