
ఇదేమి నీతి శ్రీనివాస..!
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బుసలుకొడుతున్నాయి. అందులోనూ కడప నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు రోజుకొకరు తమ అసహనాన్ని మాటలు, చేతల రూపంలో చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ‘నిజమైన తెలుగుదేశం పార్టీ గ్రూపులో హల్‌చల్ అవుతోంది’. ఇటీవల కడప నగర మేయర్‌గా ముంతాజ్‌బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన 4వ డివిజన్ నాయకులు పుత్తా శరత్‌కుమార్‌రెడ్డి, 40వ డివిజన్‌కు చెందిన సుజన్ ముంతాజ్‌బేగం బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన బ్యానర్‌లో వీరిద్దరి ఫోటోలు ఉండడం సంచలనంగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుత్తా శరత్‌కుమార్‌రెడ్డి, సుజన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు. శరత్‌కుమార్‌రెడ్డి 44వ డివిజన్ కార్పొరేటర్‌గా, సుజన్ 42వ డివిజన్‌లో నివాసముంటే 40వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అండదండలు ఉన్నాయని కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే వారిద్దరు టీడీపీలో ఉంటూనే కడప మేయర్‌గా ముంతాజ్‌బేగం బాధ్యతలు స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే బ్యానర్‌లో పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నియమాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ క్రమశిక్షణ పేరుతో అసలైన కార్యకర్తలను సస్పెండ్ చే శారు. ఇప్పుడు వీరిద్దరు వేరే పార్టీకి చెందిన బ్యానర్‌లో తమ ఫొటో వేయించుకోవడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి రాదా? అని ప్రశ్నిస్తున్నారు. మేము ఏ తప్పు చేయకపోయినా క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావు...నీ అనుచర వర్గం తప్పు చేసినా కూడా ఏ శిక్షను వేయకుండా రక్షణ కల్పించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశం ఆ గ్రూపు వేదికగా చర్చ సాగడం గమనార్హం.
తప్పు చేయకపోయినా శిక్ష మాకు
తప్పు చేసిన వారికి రక్షణగా మీరు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసుపై తమ్ముళ్ల ఆగ్రహం