
దసరా నేపథ్యంలో నిరంతర నిఘా
ప్రొద్దుటూరు క్రైం: దసరా సందర్భంగా సీసీ కెమెరాలతో ప్రొద్దుటూరులో నిరంతర నిఘా ఉంచినట్లు డీఎస్పీ భావన తెలిపారు. ఆదివారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ఆలయాలు, ఎగ్జిబిషన్ పరిసరాల్లో నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆకతాయిల చేష్టల కట్టడికి శక్తి టీంల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని తెలిపారు. అమ్మవారిశాల, శివాలయం, ఎగ్జిబిషన్ వద్ద సందర్శకుల రద్దీ క్రమబద్ధీకరణకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా క్యూ లైన్ల పర్యవేక్షణ చేస్తామన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసేందుకు అందుబాటులో హెల్త్ టీంలు సిద్ధంగా ఉంచామని డీఎస్పీ వివరించారు. శమీ దర్శనం రోజున అదనపు బందోబస్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. అమ్మవారి తొట్టి మెరవణికి 150 మంది అదనపు పోలీస్ సిబ్బందితో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు భక్తుల సందడి మరింత ఎక్కువ కానుందున ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. అత్యవసర సమయాల్లో 100, 102, 112, 912100702 (ప్రొద్దుటూరు కమాండ్ అండ్ కంట్రోల్) నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.