
పాలిటెక్నిక్ కళాశాల భవనాలను ఎందుకు కట్టించలేదు
మైదుకూరు : మైదుకూరులోని పాలిటెక్నిక్ కళాశాల కళాశాలకు సొంత భవనాలను ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ ఇపుడు ఎందుకు కట్టించలేదని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లెరఘురామిరెడ్డి ప్రశ్నించారు. మైదుకూరులో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ రాయలసీమలో కూడలిగా ఉన్న మైదుకూరుకు పాలిటెక్నిక్ కళాశాల అవసరమని తాను కోరగా అప్పటి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. సర్వే నంబర్ 1588లో కళాశాల భవనాల కోసం 2023లో ఐదెకరాల స్థలాన్ని ఇప్పించి, భవనాల నిర్మాణానికి రూ.34.97 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరైన నిధులతో కళాశాల భవనాలను ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. మైదుకూరులో ప్రత్యేక గర్‌ల్స్ హైస్కూల్ మంజూరు చేయించి నాడు–నేడు నిధులతో 70 శాతం పనులు చేయించామని, ఇంకా రూ.15 లక్షలు నిధులున్నా కూటమి ప్రభుత్వం 30 పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పాఠశాలల రూపురేఖలను మార్చినా.. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇప్పించామని 2.50 లక్షల వలంటీర్లతో పింఛన్ ఇప్పించామని తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేస్తే, ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవకాశం వస్తే చేతులకు చిక్కకుండా ప్రజలే తరిమేస్తారని అన్నారు. అనంతరం పట్టణంలోని గర్‌ల్స్ హైస్కూల్ భవనాలను వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి రఘురామిరెడ్డి పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి