
ఆశా వర్కర్లకు వేతనాలు మంజూరుచేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఆశాలకు మెరుగైన వేతనాలిచ్చి.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి గౌరవాధ్యక్షుడు గుంటివేణుగోపాల్ డిమాండ్ చేశారు. నగరంలోని ఏఐటియూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయమంటున్నారని, ఆశాలకు ముఖహాజరు పెట్టారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, కరోనా, టిబీ అలవెను్‌స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ 7న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లకు వినతిపత్రం ఇస్తామని, ఆర్డీవో కార్యాలయాల్లో వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాగసుబ్బారెడ్డి, కెసీ.బాదుల్లా, మరియమ్మ, బాలకుళ్లాయమ్మ, అనసూయ, వరలక్ష్మి, అమ్ములు, బాలగంగమ్మ, లక్ష్మీనరసమ్మ, వహీదా, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.