
అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. నిరూపించలేని పక్షంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని మాజీ మేయర్ కె.సురేష్ బాబు సవాల్’ విసిరారు. స్థానిక అపూర్వ ఫంక్షన్ హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కడపను బ్రష్టుపట్టించి దోచేశారని 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 కోట్ల బిల్లులు చేసుకుని అక్రమాలకు పాల్పడింది నీవు కాదా అని ప్రశ్నించారు. మహానాడుకు ముందు బుగ్గవంకలో కంపచెట్లు తొలగించి రూ.30 లక్షల పనికి రూ.3 కోట్లు దోచేశావంటూ ఆరోపించారు. 17 ఏళ్లుగా కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలుగా భావించి అందరినీ కలుపుకొని పోయి పనిచేశానన్నారు. 20ఏళ్లు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ప్రక్కనబెట్టి నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోలేని శ్రీనివాసులురెడ్డి ఒక మనిషేనా అని మండిపడ్డారు.
నీరు చెట్టు నిధులు నొక్కేశారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది.. కడప నగరాభివృద్ధికి రూపాయి నిధులు తెచ్చా రా.. ఒక్క రోడ్డు, కాలువ నిర్మించారా అని సూటిగా ప్రశ్నించారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు, కార్పొరేషన్ సాదారణ నిధులతో జరిగే పనులకు టెంకాయలు కొట్టడానికి సిగ్గుండాలన్నా రు. నీరు–చెట్టు నిధులను పందికొక్కుల్లా మేసిన మీరా మమ్మల్ని విమర్శించేది అంటూ నిలదీశారు. ప్రధాన రహదారుల విస్తరణ, కూడళ్లు అందంగా తయారయ్యాయంటే దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌వల్లేనని గుర్తు చేశారు. బుగ్గవంగ సుందరీకరణకు వైఎస్సార్ రూ.70 కోట్లు ఇస్తే, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రూ.72కోట్లు ఇచ్చారని, వాటితోనే రక్షణ గోడ పూర్తయి అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నారన్నారు. టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కడపను అభివృద్ధి చేసింది శూన్యమన్నారు.
తీర్మానాలను అడ్డుకుది మీరు కాదా....?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 జనరల్ బాడీ మీటింగులు జరిగితే ఒక్కటి కూడా సజావుగా జరక్కుండా ఎమ్మెల్యే మాధవి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జూలై 4న జరిగిన మొదటి సమావేశంలో సొంత పార్టీ కార్పొరేటర్‌నే తిట్టిపోశారని, కార్పొరేటర్ల భర్తలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని చెప్పి, తన భర్తను మాత్రం అధికారిక సమావేశాలకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. 2024 డిసెంబర్, 23న తీర్మాణాలకు ఆమోదం తెలుపకుండా ఎజెండా పేపర్లు చించేసింది ఎవరో తెలీదా...2025 జూన్, 20న తాము చేసిన తీర్మానాలు అమలు కాకుండా కోర్టుకు వెళ్లింది మీరు కాదా.. అని ప్రశ్నించారు. పూటకో పార్టీ మారే మీరా తనను విమర్శించేది అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా మేయర్‌తో సమానంగా ఎక్స్‌అఫిషియో సభ్యులకు కుర్చీలు వేయరని, రాష్ట్ర మంత్రులైనా కార్పొరేటర్లతో సమానంగా కూర్చొవాల్సిందేనన్నారు. పదవులు తనకు కొత్త కాదని, సర్పంచ్‌గా, జెడ్పీ ఛైర్మెన్‌గా, రెండు సార్లు మేయర్‌గా చాలా ఏళ్లు ప్రతిపక్షంలోనే కొనసాగి అన్ని పార్టీల మన్ననలు పొందానని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్లకు కప్పం కట్టలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా బెంగళూరు, హైదరాబాద్‌లలో వెంచర్లు వేస్తున్నారని, 16 నెలల్లో కడపలో ఒక్క వెంచర్‌గానీ, ఒక్క అపార్ట్‌మెంట్‌గానీ నిర్మించబడలేదన్నారు.
మేము ఇలాగే కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులురెడ్డిలాగా కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే టీడీపీ కార్యకర్తలు మిగిలి ఉండేవారా అని సురేష్‌బాబు ప్రశ్నించారు. వాళ్లలాగా తాము ఎవరినీ పీడించ లేదన్నారు. పదవులు శాశ్వతం కాదని, దేవుడు అనుగ్రహిస్తే ఇంతకంటే మంచి పదవులు వస్తాయన్నారు. తనను మేయర్ పదవి నుంచి దించేసి ఆ కుర్చీలో కూర్చొవాలని చూస్తున్నారని, కుర్చీపై ఉన్న వ్యామోహంతో ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కుర్చీ పిచ్చి ఎంత ముదిరిందంటే...ఆగష్టు 15న వేదికపై కుర్చీ కావాలని ఐఏఎస్ అధికారులనే దూషించేస్థాయికి వెళ్లిందన్నారు. ఇంత చేసిన ఆమెను కుర్చీలో కూర్చొనిచ్చే ప్రసక్తే లేదని, తమ కార్పొరేటర్లు సైనికుల్లా మారి అడ్డుకుంటారని హెచ్చరించారు.
టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులు
ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ మొదలుకొని కమిషనర్ వరకూ తెలుగుదేశం పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని సురేష్‌బాబు మండిపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటలకు తనపై అనర్హత వేటు వేసినట్లు మీడియాలో వచ్చిందని, వాస్తవానికి ఆ ఉత్తర్వులు ఈ రోజు అందాయన్నారు. ఈ లోపే గెజిట్ ప్రకటించి, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగానికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారన్నారు. తనను పదవి నుంచి దించేయడానికి ఆఘమేఘాలపై శరవేగంగా పనిచేస్తున్న అఽధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంతే వేగం చూపితే ప్రజలు హర్షిస్తారని చురకంటించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు షఫీ, అరీఫుల్లా బాషా, షంషీర్ బాషా, బాలస్వామిరెడ్డి, చెన్నయ్య, కో ఆప్షన్ సభ్యులు బి. మరియలు, జహీర్, పత్తిరాజేశ్వరి, డివిజన్ ఇన్‌చార్జులు మల్లికార్జున కిరణ్, డిష్‌జిలాన్, బసవరాజు, అక్బర్, గౌస్, సుబ్బరాయుడు, రామక్రిష్ణారెడ్డి, దాసరి శివప్రసాద్ పాల్గొన్నారు.
నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతావా?
తీర్మానం చేయకుండా అజెండా పేపర్లు చించేసింది ఎమ్మెల్యే కాదా?
16 నెలల్లో కడప అభివృద్ధికి రూపాయి నిధులు తెచ్చారా?
నన్ను పదవి నుంచి దించి కుర్చీలో
కూర్చొవాలని చూస్తున్నారు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిపై విరుచుకుపడిన
మాజీ మేయర్ సురేష్ బాబు