
కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన
కడప సెవెన్‌రోడ్స్ : వాహనమిత్ర గడువు పొడిగించడంతోపాటు అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి షరతులు లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ కేసీ.బాదుల్లా, ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్‌కు వాహనమిత్ర ద్వారా రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు 50 శాతం రాయితీతో విద్య, పెన్షన్‌తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. జీఓ నెంబరు 21, 31లను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు నారాయణ, పుల్లయ్య, రెడ్డెయ్య, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.