
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
ప్రొద్దుటూరు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్‌ఆర్ వెంకటజనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక శ్రీరాములపేట ఒంటేరు ఉపాధ్యాయ సేవా కేంద్రంలో కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చాక మనస్ఫూర్తిగా పండగ చేసుకుందామని భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తే ఒక ద్రవ్య భత్యం కానీ, మధ్యంతర భృతి కానీ ఇవ్వలేదన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయకపోవడంతోపాటు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రూ.30 వేల కోట్ల డీఏ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధి బోగాగంగాధర్ మాట్లాడుతూ.. డీఈఓ పూల్‌లో మిగులు పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి పెద్ద మనసు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. 2003 డీఎస్పీ ఫోరం కన్వీనర్లు రిజ్వాన్ అలీ, బాలజోజప్ప, పుల్లయ్య మాట్లాడుతూ.. మెమో నెంబరు 57ను వెంటనే అమలు చేయాలని కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. వాటిని ఎలా పొందాలో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు నాగచంద్రుడు, అబ్బాస్, చింతంరెడ్డి మాధవరెడ్డి, సుబ్బారెడ్డి, మూలె బ్రహ్మనందరెడ్డి, నాగరాజు, నాగేంద్ర పాల్గొన్నారు.