
సామాజిక రుగ్మతలు తొలగించడమే లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతోపాటు త్వరితగతిన పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భూ సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని, భవిష్యత్తులో అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నేరాలను తగ్గించేలా, అట్రాసిటీ చర్యలకు పాల్పడితే పడే శిక్ష, కేసులు, సెక్షన్ల అంశాలను వివరించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దష్టి సారించాలని, పోక్సో, బాల్య వివాహాల చట్టాలపై అందరికీ అవగామన కల్పించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, డీఎస్పీలు వెంకటేశ్వర్లు(కడప), భావన (ప్రొద్దుటూరు), మురళి(పులివెందుల), రాజేశ్వర్‌రెడ్డి (మైదుకూరు), తదితరులు పాల్గొన్నారు.