
కారు ఢీ కొని బాలిక మృతి
చాపాడు : మండల పరిధిలోని చిన్నగురువళూరు గ్రామంలోని దళితవాడ వద్ద రోడ్డుపైకి ఆడుకునేందుకు వచ్చిన బాలిక గొల్లపల్లె దర్శిని(6)ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లెకు చెందిన రాజు తన భార్య, కూతురుతో కలసి మండలంలోని చిన్నగురువళూరులోని తన బంధువుల ఇంట్లో బుధవారం జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బాలిక దర్శిని రోడ్డుపైన ఆడుకుంటుండగా దీనిని గమనించని డ్రైవర్ కారును రివర్స్ చేసుకుంటుండగా ప్రమాదశాత్తు బాలికను ఢీ కొంది. ఆరేళ్ల చిన్నారి కారు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిపేటలో నివాసముంటున్న పఠాన్ నసీం ఖాన్ (42) మానసిక ఆవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతురాలికి గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు వివాహం కూడా చేసింది. గత 8 సంవత్సరాల క్రితం ఆరిఫుల్లా ఖాన్ తో రెండవ వివాహం జరిగింది. అప్పటినుంచి ఆరిఫుల్లాఖాన్ కువైట్‌కు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మృతురాలికి డబ్బులు పంపకపోవడం, అనుమానంగా ప్రవర్తించడంతో మానసిక వేదనకు గురైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కారు ఢీ కొని బాలిక మృతి