
విద్యుత్ సరఫరాలో నష్టాలను తగ్గించాలి
కడప కార్పొరేషన్ : విద్యుత్ సరఫరాలో నష్టాలను పూర్తిగా తగ్గించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్(టెక్నికల్) కె.గురవయ్య సూచించారు. కడప డివిజన్ కార్యాలయంలో కడప, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి కేవలం 59.53% మాత్రమే ఉండడం ఆందోళనకరమన్నారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పొందే అవకాశాన్ని ఆయన వివరించారు. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయని, రూ.98,000 వరకు సబ్సిడీ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లో వోల్టేజ్ సమస్యల నివారణకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయాలని, విద్యుత్ అంతరాయాలను అరికట్టి, నిరంతర సేవలు అందించాలన్నారు. అనంతరం బాలాజీనగర్ సబ్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఎస్‌ఈ యస్.రమణ, హరిసేవ్యానాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు.