
యూసీఐఎల్ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: యూసీఐఎల్‌లో సమస్యలను పరిష్కరించి, పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ, ఇతర సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలని పులివెందుల ఆర్డీఓను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు, రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. గతంలో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికి అప్పజెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు. యురేనియం ప్రాజెక్టు (టైలింగ్) వ్యర్థపదార్థాల నిల్వలు, స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ నవీన్ రెడ్డి , పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య , ఆర్ అండ్ బి డీఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పర్యావరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ కిచెన్లను సిద్ధం చేయాలి
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్లను మండలాల్లో కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్‌గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ జేసీ అదితిసింగ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా, తాజాగా విద్యార్థులకు అందించే దిశగా ప్రతి మండలంలో ఒక ప్రధాన పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి, అన్ని పరికరాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 2 నాటికి పూర్తి చేసి కిచెన్ షెడ్లను నిర్వహణలోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్ హాలులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, ఇఫ్కో(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ప్రతినిధులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద వేముల, వేంపల్లి, ఒంటిమిట్ట మండలాలలో ఇప్పటికే అరటిపంటల్లో ఆధునిక, సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో దాదాపు 500 మంది రైతులు ఈ విధానాన్ని పాటిస్తూ మంచి క్వాలిటీ పంటను ఉత్పత్తి చేసి తమ ఉత్పత్తులను ఆ గ్రామంలోనే విక్రయించేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోవు కాలంలో వీటిని జిల్లా అంతటా విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, ఏపీ ఎంఐపీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.