
వంతెన.. ప్రమాదం అంచున
రాజంపేట: గుత్తి–రేణిగుంట డబ్లింగ్‌లో ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం మృకుందాశ్రమం వద్ద ఉన్న రైల్వేవంతెన ప్రమాదకరంగా మారింది. ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం.. ఉమ్మడి కడప జిల్లా మీదుగా వెళుతోంది. ఈ మార్గంలో ఒంటిమిట్ట–భాకరాపేట రైల్వేస్టేషన్ల మధ్య మృకుందాశ్రమానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి డేంజర్‌గా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జి కడప ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది.
నిత్యం రైళ్ల రద్దీ భారం
ఈ బ్రిడ్జిపై నిత్యం రైళ్ల రద్దీభారం పడుతోంది. ఉమ్మడి కడప జిల్లా మీదుగా నిత్యం 30 రైళ్లకుపైగా రాకపోకలు సాగిస్తుంటాయి. గూడ్స్‌రైళ్లు 40కి పైగా వెళ్తుంటాయి. మృకుందాశ్రమం సమీపంలో ఉన్న బ్రిడ్జి స్థితిగతిని పరిశీలిస్తే.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. వంతెన పైన, ట్రాక్ కింది భాగంలో నెర్రెలు ఏర్పడ్డాయి. వంతెన పొడవు ఇదే స్థితి కనిపిస్తోంది. అక్కడ మొక్కలు సైతం మొలవడంతో మరింత దెబ్బతింటోంది.
అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం
ఈ వంతెనను పునర్నిర్మాణం చేపట్టకపోతే.. పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాల సీజన్‌లో నీటి ఊట ఏర్పడి బ్రిడ్జిని మరింతగా దెబ్బతీస్తోంది. ఫలితంగా బ్రిడ్జి స్లాబ్, గోడలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా ఉంది. ఇప్పటికై నా రైల్వే ఇంజినీరింగ్ శాఖ ఈ బ్రిడ్జిని బాగు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.